మీ నక్షత్రానికి ఏ రెమెడీలు త్వరగా ఫలితాన్నిస్తాయి? ఈ రెమెడీస్ చేసుకుంటే సంతోషంగా వుంటారు

ఈ క్రింద చెప్పబడిన నక్షత్రాల వారికి తగ్గ రెమెడీలు ఏమిటో ఇక్కడ వివరించడం జరిగింది. దశ బాగులేదని ఏకార్యం- తల పెట్టినా జరగడం లేదు అని తలపట్టుకొనే బదులు, ఆయా జన్మ నక్షత్రాలవారు ఇక్కడ ఇచ్చిన రెమెడీలు ఆచరించి సత్వర ఫలితాలనందుకోగలరు అని ఆశిస్తున్నాను.

1. అశ్విని నక్షత్రం: వైద్యులు, సాందర్యవంతులు (స్త్రీలనా-పురుషులైనా), గుర్రాలు, గుర్రపు స్వారీ చేసేవారిని సూచించే నక్షత్రం ఇది.

* పరిహార క్రియలు: లోహంతో చేసిన గుర్రం బొమ్మను వాయవ్యంలో అమర్చాలి. ఫోటో పెట్టినా, లోహగుర్రం వెలువరించే శక్తికంటే తక్కువే! అంత పవర్ ఫుల్ కాదు

2. భరణి నక్షత్రం:
సూచించే వస్తువులు : పప్పుదినుసులు. ముఖ్యంగా ఎర్రకందిపప్పు.

* పరిహార క్రియలు: పంచదారతో చేసిన శెనగ/పెసర/కంది పూర్ణం ముద్ద లక్ష్మీదేవికి నైవేద్యం పెట్టి భార్యాభర్తలు తినాలి.

3. కృత్తిక నక్షత్రం: నిత్యార్చన చేసే వేదవిదులు, పూజారులు, పురోహితులు, అగ్నిహోత్ర పూర్వక అర్చావిధి నిర్వహించే బ్రాహ్మణులు, తెల్ల సంపెంగ, జాజి, మాలతి, మల్లి నందివర్ధన పుష్పాలు, జ్యోతిశ్శాస్త్ర వేత్తలను ఈ నక్షత్రం సూచిస్తుంది.

* పరిహార క్రియలు:

1. గృహ/కుల పురోహితుని ఆశీర్వాదం తరచుగా తీసుకుంటూ ఉండటం.

2. వేదజ్ఞానులు కనిపిస్తే, వారి శుశ్రూష -పాద నమస్కారం – ఆశీస్సులు పొందుట .

3. దేవాలయంలో అర్చన నిమిత్తం వీలయినన్ని తెలుపు రంగు పూలు పంపించడం. ఫలితం ఆశించకూడదు (ప్రసాదాల వంటివి.)

4. రోహిణి నక్షత్రం: అధికారంలో/ఉన్నతస్థాయి పాలకులు, యోగినులు, ధనికులు, ఎద్దులు జలజంతువులు, ఆవులు, పర్వతాలు రోహిణికి చెందినవి.

  • రెమెడీలు : 1. తెల్లని ఎద్దును శివాలయంలో పూజించడం/దానికి స్వయంగా మేత తినిపించడం, గోసేవ చేయడం

5. మృగశిర నక్షత్రం : సంగీతకళకారులు, వార్తాహరులు ఈ నక్షత్రానికి చెందిన వ్యక్తులు.

* రెమెడీలు :
1. వార్తాహరునికి వస్త్రాలు బహూకరించండి.

2. సంగీతవేత్తల ఆశీర్వాదం తీసుకోండి.

3.అమ్మవారి ఆలయంలో ఎర్రని వస్త్రాలు దానం.

4. ఆలయంలో పళ్లు దానం చేయండి.

6. ఆరుద్ర నక్షత్రం : జంతువుల్ని పట్టేవారు, పప్పులు విసురుట/రుబ్బుట, గారడీవాళ్లు, దొంగతనం చేసేవారు ఆరుద్రకు చెందుతారు.

* రెమెడీలు :
1. రెండు పప్పుదినుసులు కలిసి ఉండేలా ఆహారంలో ఉపయోగించండి.

2. దొంగల్ని పట్టుకోవడం/పట్టించడంలో సహాయపడడం.

3. జంతువధ నిరోధానికి సహాయ పడండి.

7. పునర్వసు నక్షత్రం : అందమైనవారు, తెలివైనవారు, మేలురకం పప్పులు-బియ్యం వర్తకులు. పేరు-ప్రఖ్యాతులున్నవారు, ఉత్తమకులాల్లో పుట్టినవారు పునర్వసు వ్యక్తులు

* పరిహార క్రియలు :

1. సద్రాహ్మణుల ఆశీస్సులు తీసుకోండి.

2. మేలిరకం బియ్యం మీ ఊరికి గాని, దగ్గరలో పడమరలో గాని ఉండే శివాలయంలో దానం చేయండి.

8. పుష్యమి నక్షత్రం : యజ్ఞయాగాదులు చేసేవారు, సాధుసత్పురుషులు, రాజులు, మంత్రులు గోధుమలు, బియ్యం, చెరకు, బార్లీ (యవధాన్యం)… ఇవన్నీ పుష్యమి వస్తువులు.

* పరిహార క్రియలు :
1. ఏవైనాసరే (పైన చెప్పబడిన వస్తువులలో) సద్రాహ్మణులకు శివాలయంలో దానం ఇవ్వాలి 2.యాగ్నికుల ఆశీస్సులు అందుకోవాలి.

9. ఆశ్లేష నక్షత్రం : విషం, పాములు, కీటకాలు, కందమూల ఫలాలు, కృత్రిమంగా తయారు చేయబడిన వస్తువులు, వైద్యులు ఆశ్రేషకు చెందుతారు.

* పరిహార క్రియలు :
1. వైద్యుల్ని సన్మానించండి.

2. చిన్న పాముబొమ్మ సీసంతో చేయించి, చెరువులోనో నదిలోనో, నూతిలోనో వేయండి.

3. దుంపజాతి ఆహారాలను దానంగా ఇవ్వండి

10. మఖ నక్షత్రం : కొండలెక్కేవారు, వ్యాపారులు, స్త్రీ ద్వేషులు, పితృభక్తులు, వీరులు, ధనధాన్య సమృద్ధి కలవారు మఖకు చెందుతారు.

* రెమెడీలు :
1. కొండమీద వెలసిన దైవాన్ని దర్శించుకోవడం
2. మాతాపితరుల్ని సేవించేవారిని వెదికి, వారి ఆశీస్సులు అందుకోవడం.

11. పుబ్బ నక్షత్రం : కళాకారులు, కవులు, సంగీత కారులు, నటులు, మిత్రవర్గం పుబ్బను సూచిస్తారు. అలాగే యువావస్థ, దూది, ఉప్పు, తేనె వగైరా కూడా.

* రెమెడీలు :

1. తేనె దానంగా ఇచ్చుట.

2. కళాకారుల్ని గౌరవించుట ఈ నక్షత్రంలో జన్మించినవారికి కలిసొచ్చే పరిహార ప్రక్రియలు.

12. ఉత్తర నక్షత్రం : దానధర్మాలు చేసేవారు, రాజులు, సత్కర్మలు ఆచరించేవారు, మంచి ధాన్యాలు.

* రెమీడీలు : ఉత్తములకు మంచి ధాన్యం దానంగా ఇవ్వాలి

13. హస్త నక్షత్రం : మావటివారు, పరాక్రమవంతులు, వ్యాపారవేత్తలు, ఏనుగులు రథాలు అధిరోహించేవారు, వేదాంతవేత్తలు, వేదపండితులు, దొంగలు, సరుకులు పప్పులు… ఇవన్నీ సూచించేది.

* రెమెడీలు :
1. వేదాధ్యయన శీలురతో కలసి తిరగండి.

2. వెండిగణేశుని బొమ్మ వేదపండితునికి దానం ఇవ్వండి.

3. వ్యాపారవేత్తలతో స్నేహం చేయండి.

14. చిత్త నక్షత్రం : సుగంధ ద్రవ్యాలు, ఆభరణములు, రచయితలు, చిత్రకారులు, గానకళావేత్తలు, గణితవిదులు, నేతపనివారు కంటి డాక్టర్లను సూచిస్తుంది.
* రెమెడీలు :
1. నేత్రదానం ఇచ్చేందుకు (తదనంతరం) సిద్దపడండి.

2. నేతగాళ్లకు పనికొచ్చే నమూనా డిజైన్లు బహూకరించడం, సుగంధ ద్రవ్యాలు ఎర్రని వస్త్రంలో కట్టి దానం ఇవ్వడం.

15. స్వాతి నక్షత్రం : గుర్రాలు, పశువులు, పక్షులు, వ్యాపారాలు, తాత్కాలిక స్నేహితులు శెనగపప్పు, తపస్సులను సూచిస్తుంది.

* రెమెడీలు:
1. దైవధ్యానంలో గడిపేవారికి రెండు కిలోల శెనగపప్పు దానం చేయండి.

16. విశాఖ నక్షత్రం : ఎర్రనిపూలు పూసే చెట్లు (మందారం, ఎర్రచేమంతి, కాంచనం, గన్నేరు మొ॥) పెసలు, మినుములు, పత్తి, శనగలు, ఫలవృక్షాలు, అగ్ని, ఆరాధకులు విశాఖ ఆధీనాలే.

* రెమెడీ:

1. అగ్నిసాక్షిగా ఎవరితోనైనా చెలిమి చేయండి.

2. శనగలు/పెసలు దానం ఇవ్వండి.

3. ఉత్తరదిశలో మందార, చేమంతి వగైరా పైన చెప్పిన
మొక్కలు పెంచండి.

17. అనూరాధ నక్షత్రం : గోష్టి సత్సంగాలు పట్ల అనురక్తి గలవారు, సత్ప్రవర్తన గలవారు, వీరులు శరదృతువులో పెరిగే అన్ని ఫల-పుష్ప జాతులు అనూరాధ ఆధీనంలో ఉంటాయి

* రెమెడీ : 1. ఖర్జూరం, బెల్లం, కొబ్బరి, బియ్యంపిండితో ఏదైనా మధుర పదార్థం తయారుచేసి దానంగా ఇవ్వాలి.

18. జ్యేష్ఠ నక్షత్రం : పెసలు, వెండి, కంచు, కర్పూరం, యుద్ధవీరులు, దొంగలు ఖర్బుజాపళ్లు జ్యేష్ట అధీనంలో ఉన్నాయి.

* రెమెడీ : కంచుపాత్రలో కర్పూరం వేసి, సైనికునికి దానం చేయండి.

19. మూల నక్షత్రం : మూలికలు, మందులు, వైద్యులు, విత్తనాలు, పండ్లు మూలకు చెందినవి.

* రెమెడీ : ఆయుర్వేద వైద్యానికి పేదల నిమిత్తం ఉచితంగా మందు లివ్వడానికి ఒక మంచి వైద్యుడ్ని చూచి డబ్బు ఇవ్వండి.

20. పూర్వాషాఢ నక్షత్రం : సముద్ర జంతువులు, నీటి పుష్పాలు, పండ్లు, నావికులు, జాలరులు, చేపలు పూర్వాషాఢకు చెందుతాయి.

* రెమెడీ: ప్రతి గురు-శుక్రవారాలలో చేపలకు ఆహారం వేయడం (లేదా) డబ్బు ఇచ్చి చేపల్ని కొని వాటిని తిరిగి నీట్లోకి – వదలిపెట్టడం .

21. ఉత్తరాషాఢ నక్షత్రమ్ : ఏనుగులు, గుర్రాలు, వృక్షాలు, ధైర్యవంతులు, మావటివారు, కుస్తీ పట్టేవారు, (మల్లయోధులు) ఉత్తరాషాఢకు చెంది వున్నవి.

* రెమెడీ: ఏనుగులు తినడానికి మావటివానికి అరటిపళ్లు ఇచ్చి దగ్గరుండి ఏనుగుచేత తినిపించాలి

22. శ్రవణం నక్షత్రం : శక్తివంతులు, మాయావులు, విష్ణుభక్తులు, నైపుణ్యం గలవారు, ధర్మాత్ములు.

* రెమెడీలు: శ్రీ వేంకటేశ్వర క్షేత్రాలు (ఉదా : తిరుపతి, ద్వారకా తిరుమల వగైరా) దర్శించడం – విష్ణు భక్తులను సందర్శించడం.

23. ధనిష్ఠ నక్షత్రం : స్త్రీలను ద్వేషించే పురుషులు, ధర్మపరాయణత కలిగినవారు, పాతమిత్రులు.

* రెమెడీ: శివాలయంలో గోధుమల్ని పుణ్యాత్ములకు దానమిచ్చుట.

24. శతభిషం నక్షత్రం : దుస్తుల శుభ్రత, యానాదులు – ఎరుకలవారు, చేపల వ్యాపారులు, నీటి నుండి లభించే వస్తువులు.

* రెమెడీ: కొంత మద్యాన్ని నీటిలో ప్రవహింపజేయడం, కల్లు సారాయి వంటివి స్వార్జితమైన విత్తంతో మద్యప్రియులకు తృప్తితీరా పట్టించడం.

25. పూర్వా భాద్ర నక్షత్రం : ఆవులమంద కాపరులు, దొంగలు, ఓషధులు, మందులు సూచితం.

* పరిహారక్రియ : ఒంటరిగా జీవించే సాధువులకు నెయ్యిని దానమివ్వడం.

26. ఉత్తరాభాద్ర నక్షత్రం : దానధర్మాలు చేసేవారు, బ్రాహ్మణులు, తపస్సు చేసేవారు, విలువైన ధాన్యాలు, పంచదార, బియ్యం పాలతో తయారయ్యే వస్తువులను ఉత్తరాభాద్ర సూచిస్తుంది.

* పరిహార క్రియ : ఎనిమిది మంది వృద్ద బ్రాహ్మణులకు కోవా పంపకం.

27. రేవతి నక్షత్రం : నీటినుండి లభించే శంఖాలు – ముత్యాలు – పద్మాలు, నావికులు, ఉప్పు సుగంధ ద్రవ్యాలు, పండ్లు – పూలు, వ్యాపారులు, నవరత్నాలు.

* పరిహారప్రక్రియ : సువాసన గల పుష్పాలను, సుగంధ ద్రవ్యాలును ఒక బుట్టతో సహా శివాలయంలో దానం ఇవ్వడం.

ఈ చిన్న రెమెడీస్ మీ నక్షత్రాలు కు చేసుకొని సంతోషంగా ఉండండి.

About Ashok Kanumalla

Ahsok

Check Also

ద్వాదశ జ్యోతిర్లింగాలను ఎందుకు దర్శించాలి ? ఏ లింగాన్ని దర్శిస్తే ఏ విధమైన ఫలితాలు ఉంటాయి

పన్నెండు జ్యోతిర్లింగాలను చూసినా, తాకినా, పూజించినా, తలచినా మానవులు ఇహపర సుఖాలను పొందుతారని శివ పురాణం చెబుతోంది. కాబట్టి మీరు …

4 comments

  1. Nice information 👌👌 given sir Tq

  2. మల్లికార్జున రావు ఊరందూరు

    Good information

  3. జన్మ నక్షత్రములు మరియు దాని గురించి చాలా విషయాలు తెలియజేసినందుకు స్వామిజీ అశోక్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *